పులులన్నీ పిల్లిజాతే

అవన్నీ ఒకే కుటుంబం.. పరిణామక్రమంలో రకరకాల జాతులుగా విడిపోయాయి. ఆకారం, దేహ నిర్మాణంలో స్వల్ప మార్పులున్నప్పటికీ బాహ్యస్వరూపం మాత్రం ఒకేరకంగా ఉంటుంది. పరిమాణం ఆధారంగా ఆహార సేకరణ, అలవాట్లలో వ్యత్యాసాలున్నాయి. వీటిలో ఓ జాతిని పరాక్రమానికి ప్రత్యామ్నాయంగా, మరోదాన్ని పిరికితనానికి చిరునామాగా పేర్కొంటాం.. ఆ జాతి మరేదో కాదు పిల్లి జాతే! ఇందులో పులి, చిరుత, చీటా, జాగ్వార్.. ఇలా రకరకాల జాతులు, ఉపజాతులు ఉన్నాయి వీటిలో కొన్ని వేగానికి మారుపేరుగా నిలిచాయి. కొన్ని వేటాడడంలో దిట్టగా పేరొందాయి. చారలన్నింటిలోన పులిచారలు వేరయా! అన్నట్లుగా జాతి జాతికి వీటి చారల్లో వైవిధ్యం కొట్టొచ్చిన్నట్లుగా కనిపిస్తుంది. వీటి పరిమాణంలో వ్యత్యాసమున్నా.. రూపం, వేటాడే తీరులో దాదాపు అన్నీ ఒకే పంథాను అనుసరిస్తాయి. అందుకే పులులన్నీ పిల్లి జాతే

 

పిల్లి జాతిలో మొదట చెప్పుకోవాల్సింది పులి.: ధైర్యానికి, పరాక్రమానికి మారుపేరు ఇది. శాస్త్రీయనామం పాంథెరా టైగ్రిస్. వేటాడంలో దీనికంటూ ప్రత్యేక శైలి ఉంటుంది. తూర్పు-దక్షిణ ఆసియాలో కనిపిస్తుంది. గరిష్ట బరువు 300 కిలోలు. ఎత్తు 110 సెం.మీ.లు. పసుపు లేదా బంగారం వర్ణంలో ఉండే శరీరం పొడవాటి కత్తుల్లాంటి చారలు దీన్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. వీటి శరీర రంగు, చారలు ఇవి గడ్డిమైదానాల్లో నక్కినా ఇతర జంతువులు గుర్తించకుండా ఉండటానికి దోహదపడతాయి. వేటాడే జీవి, మాంసాహారి. ఇండియాలో కనిపించే రాయల్ బెంగాల్ టైగర్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇవి ఇండియా, బంగ్లాదేశ్, చైనా, ఆఫ్గనిస్తాన్, ఇండోనేషియన్ ద్వీపాలలో విస్తరించాయి. వీటిలో పలు ఉపజాతులున్నాయి. అవి సైబీరియన్, ఇండో- చైనీస్, ఇండోనేసియన్, మలయన్, సమత్రన్, బాలీనీస్ తదితర రకాలున్నాయి.

చీటా:

ఇది వేగానికి మారుపేరు. భూమిపై నివసిస్తోన్న అన్ని జీవుల్లో కెల్లా అత్యధిక వేగంతో పరిగెత్తుతుంది. గంటకు 110-120 కిలోమీటర్ల గరిష్టవేగంతో పరిగెత్తగలవు. వేటాడంలో వీటికి సాటి ఎవరూ రారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇది కేవలం 3 సెకండ్లలో 90 కి.మీ.ల వేగాన్ని అందుకోగలదు. ఇది ఆఫ్రికా, ఇరాన్ ప్రాంతాలలో కనిపిస్తుంది. శాస్త్రీయనామం ఆక్సినోసిస్ జుబాటస్. బరువు గరిష్టంగా 72 కిలోలు. ఎత్తు 90 సెం.మీ.లు ఉంటుంది. శరీరం పసుపు లేదా బంగారు వర్ణంలో ఉంటుంది. శరీరంపై గుండ్రని మచ్చలుంటాయి.

 

చిరుతపులి:    దీని శాస్త్రీయనామం పాంథెరా పార్డస్. వాస్తవానికి చీటా, చిరుత రెండూ వేర్వేరు జాతులు. బంగారు వర్ణంలో శరీరంపై నల్లటి పెద్దమచ్చలు కలిగి ఉంటుంది. ఇవి పిల్లి జాతికే చెందినప్పటికీ ఇవి రెండూ ఒకటి కాదు. ఇది వేగంగా పరిగెత్తుతుంది కానీ చీటా అంత వేగంగా కాదు. దీని గరిష్ట వేగం గంటకు 58 కి.మీ. సబ్-సహారన్ ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో కనిపిస్తుంది. గరిష్ట బరువు 77 కిలోలు. ఎత్తు 78 సెం.మీ.లు

జాగ్వార్ దీని శాస్త్రీయనామం ఫాంథోరా అంకా. బరువు గరిష్టంగా 96 కిలోలు. ఎత్తు 76 సెం.మీలు. దీని శరీరం ముదురు పసుపు వర్ణంలో ఉంటుంది. దేహంపై గులాబీ పువ్వు ఆకారంలో ఉన్న మచ్చలుంటాయి. ఇవి దాక్కున్న పరిసరాలకు అనుగుణంగా కలిసిపోగలవు. ఇది నక్కి ఉండి వేటాడుతుంది. చెట్లపై ఉండే చిన్న జంతువుల్ని వేటాడటంలో నైపుణ్యం కలదు

పాంథర్:

ఇది ఉత్తర అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా అడవుల్లో కనిపిస్తుంది. దీని శరీరంలో మెలనిన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది పూర్తిగా నల్లగా ఉంటుం ది. చెట్లపై ఉంటూ వేటాడుతుంది. చిరుత, జాగ్వార్ వంటి పులి జాతుల్లో ఏర్పడే మెలానస్టిక్ రంగు వైవిధ్యాలుగా ఇవి ఉద్భవిస్తాయి. అంతే తప్ప ఇవి ప్రత్యేకమైన జాతులు కావు.