టామా అనే పిల్లి స్టేషన్ మాస్టర్


జపాన్‌లో పిల్లులకు ఎక్కువ ఉపయోగించే పేరు ‘టామా’. ఈ పేరుకు నిధి అని ఒక అర్థం. జపాన్‌లోని కిషి రైల్వే స్టేషన్‌ చాలాచిన్న రైల్వేస్టేషన్‌. 2004 వరకు దీని ఆదాయం అంతంత మాత్రమే. ఈ రైల్వేస్టేషన్‌ వకయామా ఎలక్ర్టికల్‌ రైల్వే సంస్థకు చెందినది. ఆదాయం లేకపోవడంతో వకయామా యాజమాన్యం దాన్ని మూసివేయాలనుకుంది. అప్పుడు స్టేషన్‌మాస్టర్‌గా పనిచేసిన తొషికో కొయామా టామా అనే పిల్లిని  పెంచుకున్నారు. టామా స్టేషన్లో పచార్లు చేసేది. అందరూ దాంతో సరదాగా ఆడుకునేవారు. ఆ పిల్లి వల్ల ప్రయాణికులు కూడా పెరిగారు. వకయామా సంస్థ 2007 సంవత్సరంలో టామాను స్టేషన్‌ మాస్టర్‌గా నియమించారు. పిల్లి సార్‌ను చూడడానికే ప్రయాణికులు వచ్చేవారు. దాంతో స్టేషన్‌ ఆదాయం మరింత పెరగడంతో పాటు ప్రపంచంలోనే ప్రత్యేక స్టేషన్‌గా గుర్తింపు పొందింది. టామా కోసం ప్రత్యేక కార్యాలయం ఉండేది. ఈ చిట్టి పొట్టి మార్జాలం స్టేషన్‌ అంతా కలియ తిరిగేది. మెడలో గుర్తింపు కార్డు, నెత్తిపైన టోపి ధరించి స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై దర్జాగా తిరిగేది. రైళ్లలోకి ఎక్కి అంతా చూసి వచ్చేది. ప్రయాణికులు సరాదాగా దాంతో ఆడుకునేవారు, ఫొటోలు దిగేవారు. దీనికి ప్రత్యేకమైన భోజనం పెడతారు. అంతేకాదు దీని కింద ఇద్దరు ఉద్యోగులు కూడా ఉంటారు. అదీ టామా లెవల్‌. టామా స్టేషన్‌ మాస్టర్‌ అయ్యాక స్టేషన్‌ అధికారులు దాని పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. టామా చక్కగా కేట్‌ కట్‌ చేస్తూ, ముద్దుగా ఫొటోలకు పోజులిచ్చింది. స్టేషన్‌ మాస్టారు నుంచి ఆలా్ట్ర స్టేషన్‌ మాస్టారుగా, సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌గా టామా అంచెలంచెలుగా ఎదిగింది. మరో రెండు రోజులు టామా బతికి ఉంటే ఎటర్నల్‌ స్టేషన్‌ మాస్టారు హోదా వచ్చేది. ఇంతలోనే టామా మరణించింది. దాదాపు 9 సంవత్సరాల పాటు స్టేషన్‌ మాస్టర్‌గా విధులు నిర్వర్తించిన టామా గుండెపోటుతో మరణించడం బాధాకరమని అధికారులు తమ సంతాపాన్ని తెలియజేశారు. టామాను చివరి సారి చూడటానికి 3000 పైగా అభిమానులు వచ్చారు. అభిమానుల సమక్షంలో స్టేషన్‌ ప్రాంగణంలోనే షింటో సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు టామాకు ఘన నివాళులర్పించడంతో పాటు టామాకు దేవత హోదాని ప్రకటించారు. టామా ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులంతా ప్రార్థించారు. వచ్చే నెలలో పర్వతంపైన టామాకు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వకయామా సంస్థ అధ్యక్షుడు మత్సునోబు తెలిపారు.