స్మార్ట్_ఫోన్లను రక్షించే.. కిల్ స్విచ్

మీరు ఖరీదైన స్మార్ట్_ఫోన్ వాడుతున్నారా? అది పోతుందేమోనని భయం భయంగా, జాగ్రత్తగా దాచుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి.. ముందుగా మీరు  కిల్ స్విచ్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. అది ఉంటే చాలు.. వేలాది రూపాయల విలువ చేసే మీ ఫోన్, అందులోని అత్యంత విలువైన డేటా ఎక్కడికీ పోవు. ఫోన్ పోయినా సరే, ఎక్కడినుంచైనా ఆ ఫోన్_ను రిమోట్_గా డిజేబుల్ చేయడానికి.. లేదా కిల్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీన్నే బ్రికింగ్ అని కూడా అంటారు. అంటే.. ఎంతో విలువైన ఫోన్_ను ఎందుకూ పనికిరాని ఒక ఇటుక ముక్కలా మార్చేయడం అన్నమాట.

ఈ ఆప్షన్ వాడటం వల్ల అమెరికాలో స్మార్ట్_ఫోన్ల దొంగతనాలు గణనీయంగా పడిపోయాయి. 2013 సంవత్సరంలో దాదాపు 31 లక్షల ఫోన్లు పోతే, 2014లో.. ఈ ఆప్షన్ వాడటం మొదలు పెట్టిన తర్వాత కేవలం 21 లక్షల ఫోన్లే పోయాయి. దొంగతనం చేసిన తర్వాత ఆ ఫోన్ ఎందుకూ పనికిరాకపోవడంతో, దొంగలు కూడా వేరే పనులు చూసుకుంటున్నారట. వాస్తవానికి ఈ యాప్_ను శాంసంగ్ కంపెనీ 2013లోనే రూపొందించింది. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంతో పాటు ఇప్పుడు కాలిఫోర్నియాలో కూడా తప్పనిసరిగా అన్ని ఫోన్లలో ఈ కిల్ స్విచ్ వేసుకోవాల్సిందేనని నిబంధన తెచ్చారు.