అంకెలు చెప్పడం లో గిన్నీస్ రికార్డ్

ప్రస్తుతం ఈ రికార్డు తాజాగా అరవింద్‌ అనే కోయింబత్తూరు టీచర్‌ సాధించారు. ఈ టీచర్‌ కోయింబత్తూరులో విదేశీభాషలు నేర్పిస్తారు. ఆయన 270 అంకెలను ఒక వరుసలో గుర్తుపెట్టుకుని అదే వరుసక్రమంలో ఒక నిమిషంలోనే చెబుతారు. ఇది జ్ఞాపకశక్తికి పరీక్షవంటిది. ఎన్నిసార్లు అడిగినా ఆయన క్రమం తప్పరు, సమయం దాటరు. ఇందుకు ఆయన ప్రత్యేక శిక్షణ ఏదీ తీసుకోలేదు. స్వయంకృషితో ఈ విద్య నేర్చుకున్నారు. గిన్నెస్‌ సాధించారు. ఈ కార్యక్రమంఏప్రిల్‌ నెలలో కోయింబత్తూరులోని కస్తూరి శ్రీనివాసన్‌ ట్రస్ట్‌ వేదికగా జరిగింది.

గతంలో జయసింహ అనే భారతీయుడు 264 అంకెలను ఒక నిమిషం కాలంలో అదే క్రమంలో చెప్పి గిన్నెస్‌ రికార్డు సాధించారు. ఆ రికార్డును అరవింద్‌ బద్దలుకొట్టాడు. అరవింద్‌ స్పానిష్‌, ఇటాలియన్‌, పోర్చుగీస్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌ భాషలు నేర్చుకున్నారు. ఈ భాషలనే ఆయన విద్యార్థులకు నేర్పిస్తున్నారు. ఇలా అంకెలను గుర్తు పెట్టుకుంటే ఎవరికైనా జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆయన అంటున్నారు. గిన్నెస్‌ రికార్డుకోసం కాకపోయినా మన జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికైనా అంకెలను బట్టీపట్టడం మొదలుపెట్టవచ్చుకదా!