కొన్ని కొవ్వు పదార్థాలతో మేలు!

కొవ్వు పదార్ధాలు, పప్పులు తింటే లావు అవుతామేమోనని చాలామంది వాటిని అసలు ముట్టుకోరు. కానీ కొవ్వు పదార్థాలు అన్నీ హానికరమైనవి కావు. పచ్చికొబ్బరి, వెన్న, చీజ్‌ వంటి శాచ్చురేటెడ్‌ (సంతృప్త) కొవ్వులు మాత్రమే శరీరానికి హాని కలగజేస్తాయి. పాల పదార్థాలు, గింజలు, పప్పులు, గుడ్డు, చేపలు వంటి వాటి నుంచి లభించే అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వు పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజూ 45 గ్రాముల గింజలు ముఖ్యంగా పల్లీలు తింటే శరీరంలోని అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. అందువల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని నిపుణుల అభిప్రాయం. ఇంకొందరేమో గింజలు, పప్పులు తినడం వల్ల లావు అవుతామనుకుంటారు. కానీ, వాటిలో ఉండే అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వుల వల్ల శరీరంలో పేరుకుపోయిన ఎల్‌డీఎల్‌ అనే కొవ్వు పదార్థం కరుగుతుంది. అలాగని ఎక్కువగా తింటే ఇబ్బందే. మరికొందరేమో చక్కెర తింటే మధుమేహం వస్తుందనుకుంటారు. అసలు మధుమేహం మన జీవన విధానం, అధిక శరీర బరువు, కొవ్వుపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది. అంతేగానీ, చక్కెర తినడం వల్ల డయాబెటిస్‌ రాదు. కానీ డయాబెటిస్‌ వచ్చాక చక్కెర తినడాన్ని నియంత్రించుకోవాలి.