భూకంపాలను ముందే గుర్తించే ‘బ్రింకో’ పరికరం

భూకంపం.. సునామీ వంటి పకృతి వైపరీత్యాలను ముందే గుర్తించే ఓ కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో ఆస్తి నష్టం మాటెలా ఉన్నా ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. ఈ పరికరం పేరు బ్రింకో. చిన్నగా, గుండ్రంగా కనిపించే ఈ లోహపు సిలిండర్‌ను మొబైల్‌ యాప్‌తో పాటు అంతర్జాతీయ సిస్మోగ్రాఫ్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తామని అన్నారు. బ్రింకోను ఇంట్లో పెట్టుకుంటే చుట్టు పక్కల ప్రాంతాల్లో భూకంపం వచ్చే ప్రమాద చిహ్నాలు కనిపిస్తే అలారం మోతతో మిమ్మల్ని హెచ్చరిస్తుందన్నారు. సాధారణంగా భూకంపం వచ్చే ముందు స్వల్ప స్థాయి ప్రకంపనలు చోటుచేసుకుంటాయని, వీటితో ఎలాంటి నష్టం కలిగే ప్రమాదం లేదన్నారు. ఇవి రాబోయే భారీ ప్రకంపనలకు ప్రమాద సూచికలుగా పనిచేస్తాయని అన్నారు. స్వల్ప స్థాయిలో వచ్చే ప్రకంపనలను బ్రింకో గుర్తించి, వాటి తీవ్రతను సూచిస్తూ ప్లాష్‌లైట్‌ ద్వారా హెచ్చరిస్తుందని చెప్పారు. ఈ హెచ్చరికలు విన్న వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లడంతో పాటు మిగతావారినీ అప్రమత్తం చేయవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. ఇక సునామీ రాకకు సంబంధించి బ్రింకో కొన్ని గంటల ముందే హెచ్చరిస్తుందని చెప్పారు.