చెర్రీలతో బోలెడు లాభాలు

ఎర్రగా నిగనిగలాడే చెర్రీలను చాలామంది ఇష్టపడతారు. చెర్రీలు తరచుగా తీసుకోవడం వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయని ఓరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. చిరుతిండి తినాలనిపించినప్పుడు వేపుడు పదార్థాలు కాకుండా, గుప్పెడు చెర్రీలు తీసుకోవడం మేలని వారు అంటున్నారు. తక్కువ కేలరీలు ఉండే చెర్రీలు బరువు తగ్గడానికి దోహదపడతాయని చెబుతున్నారు. అంతేకాకుండా, ఇవి వ్యాయామం వల్ల వచ్చే ఒంటి నొప్పులను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు. చెర్రీలలో పుష్కలంగా లభించే మెలటోనిన్ వల్ల నిద్రలేమి సమస్య కూడా మటుమాయమవుతుందని చెబుతున్నారు. అలాగే, చెర్రీల్లో పుష్కలంగా ఉండే  ఆంథోసియానిన్ వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయని మిచిగాన్ వర్సిటీ నిపుణులు చెబుతున్నారు.