ఉత్తర కొరియా యుద్ధానికి దగ్గరగా వస్తోంది. యూఎస్ రాయబారి నిక్కీ హేలీ

క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా యుద్ధానికి రెచ్చగొడుతోందని, అదే జరిగితే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని అమెరికా హెచ్చరించింది. క్షిపణి ప్రయోగంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో యూఎన్‌లో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ ప్యాంగ్యాంగ్‌కు ఘాటు హెచ్చరికలు చేశారు. ‘యుద్ధం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు. ఉత్తరకొరియాను సర్వనాశనం చేస్తాం. ఉ.కొరియా నియంత యుద్ధాన్నే ఎంచుకుంటున్నారు. మాకు ఇప్పటికీ యుద్ధం చేయాలనే ఆలోచన లేదు. కానీ, ఆ దేశం యుద్ధానికి దగ్గరగా వస్తోంది’ అని హేలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉ.కొరియాతో అన్ని దేశాలు సంబంధాలను తెంచుకోవాలి. ఐరాస భద్రతా మండలి పెట్టిన ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ అమలు చేయాలి. ఆ దేశంతో ఉన్న ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలకు ముగింపు పలకాలి అని ఆమె డిమాండ్‌ చేశారు. దాదాపు రెండు నెలల తర్వాత ఉత్తరకొరియా బుధవారం ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు కిమ్‌ దేశం ప్రకటించింది. దీంతో మొత్తం ఉత్తర అమెరికా ఖండం తమ క్షిపణి పరిధిలోకి వచ్చిందని పేర్కొంది. తాజా క్షిపణి ప్రయోగంపై అగ్రరాజ్యం అమెరికా సహా దక్షిణకొరియా, జపాన్‌ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.