ట్రంప్‌ హెచ్చరికలు పెడచెవినపెడుతున్న పాక్. యూఎస్‌ ఆర్మీ జనరల్‌ జాన్‌ నికోల్సన్‌

పాకిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ఆ దేశ వైఖరిలో మార్పు రావడం లేదని యూఎస్‌ ఆర్మీ జనరల్‌ జాన్‌ నికోల్సన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను నియంత్రించకపోతే పాక్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గతంలో ట్రంప్‌ పలుమార్లు హెచ్చరించారు. వాటిని పాక్‌ పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది. పాక్‌ ప్రవర్తన తీరులో ఎటువంటి మార్పులు రాలేదన్నారు. హక్కానీ నెట్‌వర్క్‌, మిలిటెంట్‌ గ్రూపులకు పాక్‌ స్వర్గధామంగా మారింది. కిడ్నాప్‌కు గురైన అమెరికా-కెనడా జంటను ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదుల నుంచి రక్షించేందుకు పాక్‌ ఎంతగానో సహాయం చేసింది. దీంతో అమెరికా-పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు మెరుగుపడతాయని భావించాం. కానీ వారిలో ఇప్పటి వరకు ఎటువంటి మార్పులు మాత్రం కనిపించలేదు. ఉగ్రవాదులను తరిమివేయడంలో పాక్‌ చర్యలు తీసుకుంటుందని అనుకున్నాం. కానీ అది జరగలేదు. పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ)కు హక్కానీ నెట్‌వర్క్‌ మిలిటెంట్‌ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయి’ అని నికోల్సన్‌ ఆరోపించారు. పాక్‌లో ఉంటున్న ఉగ్రవాదుల జాబితాను కూడా యూఎస్‌ పాక్‌కు అందజేసిన విషయం తెలిసిందే.