తమిళనాడు: శశికళ బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ బంధువుల ఆస్తుల లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి 80మందికిపైగా ఐటీ అధికారులు ఏకంగా 30 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. జయలలిత ప్రారంభించిన జయ టీవీ, అన్నాడీఎంకేకు చెందిన నమధు ఎంజీఆర్‌ పత్రిక కార్యాలయాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జయటీవీ కార్యాలయంలో దాదాపు పదిమంది ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ పత్రిక, టీవీలు శశికళ కుటుంబసభ్యుల  అధీనంలో ఉన్నాయి. పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయటీవీ, ఎంజీఆర్‌ పత్రిక పనిచేస్తున్న నేపథ్యంలోనే వీటిపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. శశికళ బంధువులైన దినకరన్‌, దివాకరన్‌, ఇళవరసి, శశికళ మేనకోడలు కృష్ణప్రియ ఇంట్లో ఐటీ దాడులు ఏకకాలంలో కొనసాగుతున్నాయి. జయలలిత ఆస్తులు ప్రస్తుతం శశికళ కుటుంబసభ్యుల నియంత్రణలో ఉన్నాయి. వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో శశికళ టార్గెట్‌గా ఐటీ దాడులు జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.