పోలవరం ప్రాజెక్టు ఆపివేయాల్సిందే అని చెబితే కేంద్రానికే అప్పగిస్తాం. ఏపి సియం చంద్రబాబు

పోలవరం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ టెండర్ల ప్రక్రియ ఆపాలంటూ కేంద్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అమర్జిత్‌సింగ్‌ లేఖ రాయడంపై అసెంబ్లీలో, సభ బయట చంద్రబాబు స్పందించారు. మొత్తం పరిస్థితిని కేంద్రానికి వివరిస్తాం. అయిప్పటికీ ఆపివేయాల్సిందే అని చెబితే అలాగే చేసి, ప్రాజెక్టును కేంద్రానికే అప్పగిస్తాం. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సాయం చేయాలని పదేపదే అడుగుతున్నాం. సాయం చేయలేమని వారు చెప్పారనుకోండి ఏం చేస్తాం! నమస్కారం పెట్టి తప్పుకొంటాం! అని తేల్చిచెప్పారు. అయితే, తాను ఆశావాదినని, చివరి నిమిషం వరకూ తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తిచేస్తామంటే తక్షణమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎవరు కట్టినా ప్రాజెక్టు పూర్తికావడమే నా జీవితాశయం. ఈ విషయంలో ఎలాంటి భేషజాలూ లేవు అని చంద్రబాబు సభా సాక్షిగా ప్రకటించారు. అన్ని రకాల సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ పనులు చేస్తున్నామని, ఒక్కసారి ఆగితే వాటిని గాడిన పెట్టేందుకు చాలా సమయం పడుతుందని తెలిపారు. ‘‘ప్రాజెక్టుకోసం నాలుగువేల మంది పని చేస్తున్నారు. వందలకొద్దీ యంత్రాలున్నాయి. విదేశీ కంపెనీలూ పని చేస్తున్నాయి. పని ఒక్కసారిగా ఆగితే మళ్లీ అందర్నీ ఒకచోటకు తీసుకురావడానికి చాలా కష్టమవుతుంది అని చంద్రబాబు వివరించారు.