ఎస్సీ వర్గీకరణ: ఎమ్మార్పీఎస్‌ కలెక్టరేట్ల ముట్టడిలో మహిళా కార్యకర్త మృతి

ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనే డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం విషాదానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం కలెక్టరేట్ల ముట్టడిలోభాగంగా ఆబిడ్స్ లోని హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడికి ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు యత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ వెస్ట్ మారేడుపల్లి కంటోన్మెంట్‌లోని గాంధీ హట్స్‌ ప్రాంతానికి చెందిన భారతి (45) అనే కార్యకర్త కిందపడిపోయారు. దీనిని గమనించిన ఇతర కార్యకర్తలు, పోలీసులు ఆమెకు ఫిట్స్‌ వచ్చిందని భావించి ప్రాథమిక చికిత్స అందించారు. అయినా ఆమె స్పృహలోకి రాకపోవడంతో అంబులెన్సులో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భారతి మృతి పట్ల ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంతాపం వ్యక్తంచేశారు. ఈ ఘటన దురదృష్టకరమని, భారతి కుటుంబానికి ఎమ్మార్పీఎస్‌ అండగా ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించనున్న భారతి అంతిమయాత్రలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. భారతి అనారోగ్యంతో చనిపోయిందంటూ ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, జి.చిన్నారెడ్డి అన్నారు. భారతి కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.