మధ్యప్రదేశ్‌: బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష

మధ్యప్రదేశ్‌లో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయానికి ఉపక్రమించింది. 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు మరణ శిక్ష విధించాలన్న తీర్మానానికి ఆ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.మహిళలపై సామూహిక అత్యాచారం చేసే నిందితులకు కూడా మరణ శిక్ష విధించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అత్యాచారం రుజువైన పక్షంలో నిందితులకు విధించే శిక్ష, జరిమానా మొత్తాన్ని పెంచేందుకు సైతం శిక్షా స్మృతిని సవరించేందుకు సైతం అంగీకారం తెలిపింది. మహిళలపై అత్యాచారయత్నం చేసినా, వెంటపడి వేధించినా రూ.లక్ష జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ శీతాకాల సమావేశాల్లో శాసనసభలో బిల్లు ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి జయంత్‌ తెలిపారు. రాష్ట్రంలో బాలికలపై ఆకృత్యాలు నియంత్రించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఎన్‌సీఆర్‌బీ రికార్డుల ప్రకారం దేశంలో అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది.