లోక్‌పాల్‌ చట్టాన్ని నీరుగార్చిన మోదీ ప్రభుత్వం. అన్నాహజారే

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం అవినీతి నిరోధక లోక్‌పాల్‌ చట్టాన్ని నీరుగార్చిందని సామాజిక కార్యకర్త అన్నాహజారే ఆరోపించారు. అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తన హయాంలో లోక్‌పాల్‌ చట్టాన్ని బలహీనంగా రూపొందించారు. ప్రస్తుత ప్రధాని మోదీ దాన్ని మరింత నిర్వీర్యం చేశారని అన్నారు. ప్రభుత్వ అధికారుల భార్య, కుమారుడు, కుమార్తె ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని 2016 జులైలో చట్టానికి సవరణలు చేశారని గుర్తుచేశారు. చట్ట ప్రకారం అధికారుల కుటుంబ సభ్యులు తమ ఆస్తులను ఏటా వెల్లడించాలనే నిబంధన ఉందని చెప్పారు. కేవలం ఒక్క రోజులోనే ఎలాంటి చర్చ చేపట్టకుండా లోక్‌సభలో సవరణ బిల్లును ఆమోదించారని అన్నారు. దేశంలో 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ 5000 పెన్షన్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.