పురుషాధిక్య సమాజంలో మహిళలు రాణించడం గొప్ప విషయం. ఇవాంక ట్రంప్‌

 

హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సదస్సు(జీఈఎస్‌)లో పాల్గొనడం సంతోషకరమని ఇవాంక ట్రంప్‌ అన్నారు. హైదరాబాద్ ఇన్నోవేషన్‌ హబ్‌గా ఎదుగుతుందన్నారు. అమెరికాకు భారత్‌ అసలైన మిత్ర దేశమని, ఎంతో చరిత్ర, ప్రాశస్త్యం ఉన్నాయని అన్నారు. ముత్యాల నగరంలో యువతే గొప్ప సంపదని, ఇక్కడి పారిశ్రామికవేత్తలు సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారని కొనియాడారు. మీరంతా రాత్రింబవళ్లు కష్టపడి రోబోలు, యాప్‌లు రూపొందిస్తున్నారని ఇవాంక ప్రశంసించారు. భారతీయ నిపుణులు తమకు స్ఫూర్తిదాయకమని, టీ అమ్మే స్ధాయి నుంచి ప్రధాని కాగలడం మీ ప్రధాని గొప్పతనమని ఆమె ప్రస్తుతించారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీహబ్‌ రూపొందింది. ఈ సదస్సులో 52 దేశాలకు పైగా మహిళలు పాల్గొనడం ఆనందంగా ఉంది. పురుషాధిక్య సమాజంలో మహిళలు రాణించడం గొప్ప విషయం. ఓ పారిశ్రామికవేత్తగా మహిళ ఎదగడం ఎంత కష్టమో నాకు తెలుసు. మహిళలు మరింత కష్టపడాలని తెలుసుకున్నా’అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. గత పదేళ్లలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పది శాతం పెరిగిందని చెప్పారు. టెక్నాలజీతో పాటు రుచికరమైన బిర్యానీకి భారత్‌ అడ్డా అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని..గత దశాబ్ధకాలంగా మహిళలు ఎంతో ఎత్తుకు ఎదిగారని చెప్పారు. కష్టపడితే మహిళలు వారి భవిష్యత్‌ను వారే తీర్చిదిద్దుకోగలరన్నారు.