మసూద్‌ అంతర్జాతీయ ఉగ్రవాది కాదు, భారత్ తో కలసి పనిచేస్తాం. చైనా

పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ నాయకుడు, పఠాన్‌కోట్‌ దాడి సూత్రధారి మసూద్‌ అజహార్‌పై ‘అంతర్జాతీయ ఉగ్రవాది’ ముద్ర పడకుండా చైనా గురువారం మరోసారి అడ్డుకుంది. శుక్రవారం భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటన చేసింది. భారత్‌లో సత్సంబంధాలకు చైనా కీలక ప్రాధాన్యం ఇస్తుందని ఆ దేశ విదేశాంగ సహాయ మంత్రి చెన్‌ జియోడాంగ్‌ అన్నారు. ఈ విషయంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన చైనాకు భారత్‌ ముఖ్యమైన పొరుగుదేశం. ఈ నవశకంలో చైనా తన ప్రమాణాలతో పొరుగుదేశాల దౌత్యసంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తోంది. భారత్‌-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు మేం భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పొరుగుదేశాలతో సహాకారం విషయంలో గత కొన్నేళ్లుగా చైనా ఇదే వైఖరి పాటిస్తోందన్నారు.  మసూద్‌ అజహార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనను చైనా గురువారం తిరస్కరించింది. మసూద్‌ విషయంలో చైనా ఇలా అడ్డుకట్ట వేయడం ఇది నాల్గోసారి. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని చెబుతూ వీటో అధికారంతో దీన్ని తిరస్కరించింది. భద్రతామండలిలోని 15 దేశాల్లో అమెరికా సహా 14దేశాలు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి మద్దతివ్వగా ఒక్క చైనానే అడ్డుచెప్పడం గమనార్హం.