కృష్ణానదిలో పడవ ప్రమాదం: 19 మంది మృతి

కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తా పడడంతో 19 మంది మృతి చెందారు. విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి ఇబ్రహీంపట్నం సంగమం వద్దకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరిని స్థానికులు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. మృతుల్లో ఎక్కువ మంది ఒంగోలుకు చెందిన వారు. గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి, అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒంగోలు వాకర్స్‌ క్లబ్‌కు చెందిన బృందం 60 మంది రెండు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో అమరావతికి ఆదివారం ఉదయం వచ్చారు. ఇక్కడ పలు ప్రదేశాలను సందర్శించిన తర్వాత విజయవాడలోని పున్నమిఘాట్‌కు వారు సాయంత్రం చేరుకున్నారు. అక్కడి నుంచి పడవలో సంగమంవద్ద నిత్యహారతిని తిలకించేందుకు వెళ్లాలనుకున్నారు. అప్పటికే సాయంత్రం 4.30 కావడం, రద్దీ ఎక్కువగా ఉండడంతో ఏపీ పర్యాటకశాఖకు చెందిన పడవ రాదని సిబ్బంది తెలిపారు. అక్కడే ఉన్న ప్రైవేటు సంస్థ రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్స్‌కు చెందిన పడవను మాట్లాడుకున్నారు. ఈ పడవకు కృష్ణా నదిలో తిరిగేందుకు అనుమతే లేదు. దానిలో 20 మందిని కూడా ఎక్కించడానికి వీలులేకపోయినా 38 మందిని ఎక్కించారు. నదిలో ఇసుక మేటలు ఉన్నాయి. పడవ ఒక వైపునకు కొంచెం ఒరిగింది. పర్యాటకులు భయంతో మరోవైపునకు వచ్చారు. ఇదే సమయంలో డ్రైవర్‌ పడవను ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో అది బోల్తా పడింది.