ఆంధ్రప్రదేశ్‌: డిశెంబర్ 15న డీఎస్సీ నోటిఫికేషన్‌, మంత్రి గంటా

ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ వివరాలను మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. ఈ నెల 15న సిలబస్‌, నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 45 రోజుల పాటు అప్లికేషన్‌కు గడువు ఉంటుందని వెల్లడించారు. మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జూన్‌ 12 కల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. 1998, 2008, 2012 డిఎస్సీ అభ్యర్థుల సమస్యల పరిష్కరించడానికి ఎమ్యెల్సీ, అధికారులతో కమిటీ నియమిస్తున్నట్లు గంటా తెలిపారు. నివేదిక రాగానే అభ్యర్థులకు న్యాయం చేస్తామని చెప్పారు. రూ. 5 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ కాలేజీలపై ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని అన్నారు.