నిద్ర తక్కువైతే డయాబెటిస్

రాత్రి ఎంత లేట్ గా పడుకున్నా ఉదయం ఆరుగంటలకే నిద్ర లేవాల్సిందే. ఇక ఉద్యోగులు అయితే ఐదుగంటలకే నిద్రలేచి పనుల పరుగుల్లో అలసిపోవాల్సిందే. ఒకవైపు నిద్ర సరిగ్గా ఉండదు. మరొకవైపు అధిక పనుల వల్ల శారీరక సమస్యలు వస్తున్నాయి. నిద్రసరిగా పోకుండా నిర్లక్ష్యం చేసేవారికి డయాబెటిస్‌ త్వరగా సోకే ప్రమాదముందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. మూడు రోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్రలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలో గ్లూకోజ్‌ నియంత్రణగా గుర్తించారు. నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్‌ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్లు ఎక్కువసేపు మెలకువతో ఉండేవారికి షుగర్‌ వచ్చే అవకాశముందని అంటున్నారు.  ముఖ్యంగా చదువుకునే పిల్లలు గుర్తించు కోవాల్సిన విషయమిది. అయితే వయసులో ఉండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే ప్రమాదముంది. ఇక డయాబెటిస్‌ లక్షణాలు ఇప్పటికే కనిపించినవారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. దీని వలన హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారస్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసుకెళ్లే ప్రమాదముంది. కాబట్టి డయాబెటిస్‌ రోగులు తగినంత వ్యాయామం చేయడమే కాదు తగినంత నిద్ర కూడా పోవాలి.