బ్లాక్ టీ

ఆరోగ్య సమస్యలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు ఇప్పుడంతా. అలా తయారైన కొత్త ఆహారప పదార్థాల లిస్టులోకి బ్లాక్ టీ కూడా చేరింది.  ఈ మార్పు ఎంతో మంచిదంటోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. ఈ సంస్థ నిర్వహించిన ఓ పరిశోధనా ఫలితాలు బ్లాక్ టీ ప్రయోజనాల్ని బయటపెట్టాయి. అవేమిటంటే…

బ్లాక్ టీ ‘కరొనరీ ఆర్టరీ డిస్‌ఫంక్షన్’ని తగ్గిస్తుందట. అందువల్ల గుండె జబ్బులతో బాధపడేవారు రోజూ కచ్చితంగా ఒక కప్పు బ్లాక్ టీ తాగటం మంచిదంటున్నారు.

బ్లాక్ టీలో ఉండే రసాయనాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. వీటిలో విస్తారంగా ఉంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, జీర్ణక్రియా వ్యవస్థకు హాని కలిగించే పదార్థాలతో పోరాడుతుందట.

బ్లాక్ టీలో ఉండే టానిన్స్… డయేరియాను తగ్గిస్తాయి. శరీరంలో ఉండే చెడు కొవ్వును కరిగిస్తుంది. ఫాటల్ అటాక్స్ బారిన పడకుండా రక్షిస్తుంది. రోజుకు మామూలు టీ తాగే వారితో పోలిస్తే బ్లాక్ టీ తాగేవారిలో గుండెనొప్పి వచ్చే అవకాశం 21 శాతం తక్కువ. ఆస్థమా రోగుల శ్వాసక్రియను మెరుగు పర్చడంలో బ్లాక్ టీ పెద్ద పాత్రే పోషిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి కోరలకు చిక్కకుండా బ్లాక్ టీ కాపాడుతుంది.
బ్లాక్ టీ కొన్ని రకాల క్యాన్సర్ కారకాలతో పోరాడుతుందని పరిశోధనలో తేటతెల్లమయ్యింది. ముఖ్యంగా ఇది తాగే మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటోందట.

ఇందులో ఉండే పాలిఫినాల్స్ పేగులను ఇన్‌ఫ్లమేషన్ నుంచి కాపాడతాయి. అందువల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, పేగుల వ్యాధులు రాకుండా ఉంటాయి.దీనిలో ఉండే ఫైటోకెమికల్స్ ఎముకలను గట్టిపరుస్తాయి. జుట్టు కుదుళ్లు బలపడటానికి, చర్మం ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా బ్లాక్ టీ సహాయపడుతుంది.