మహేష్ ఆసక్తికర నిర్ణయం

మహేశ్ బాబు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇకపై ఆయా నగరాల్లో థియేటర్స్ ను కొనుగోలు చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడట. అందులో భాగంగా ఆయన హైదరాబాదులో ఒక థియేటర్ ను కొనుగోలు చేశాడని అంటున్నారు. హైదరాబాద్ – గచ్చిబౌలిలోని ‘ప్రిస్టన్ ప్రైమ్ మాల్’ లోని నాలుగు స్క్రీన్స్ కలిగిన ఒక థియేటర్ ను ఆయన కొనుగోలు చేసినట్టుగా చెబుతున్నారు. ఇందు కోసం ఆయన 12 కోట్ల వరకూ చెల్లించాడనే టాక్ వినిపిస్తోంది. ఇక మిగతా నగరాల్లోనూ ఆయన థియేటర్స్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడట. ఈ మధ్యకాలంలో మల్టీప్లెక్సుల జోరు కొనసాగుతోంది. ఆయా నగరాల్లో కొత్త సినిమా విడుదలైందంటే చాలు, మల్టీ ప్లెక్సులకి ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. తన సినిమాల విడుదల విషయంలో థియేటర్ల సమస్య రాకూడదనే ముందుచూపుతోనే మహేశ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.